షర్మిలకు భర్త అనిల్ పరామర్శ !

Telugu Lo Computer
0


పోలీసులపై దురుసుగా ప్రవర్తించటంతో వైయస్ షర్మిల ను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ కు ఆమెను తరలించిన విషయం తెలిసిందే. దీంతో వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పరామర్శించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఆయన ఈరోజు ఉదయం అసలు ఏం జరిగింది అన్న విషయాలను షర్మిలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సిట్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల తీరును, పోలీసుల తోపులాట సందర్భంగా తనకు తగిలిన గాయాలను ఆమె భర్తకు చూపించారు. ప్రస్తుతం వైయస్ షర్మిల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే వైయస్ షర్మిల పోలీసులను కొట్టడం పై పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందించారు. షర్మిల సచివాలయానికి వెళతారని తమ వద్ద సమాచారం ఉందని, అందుకే ఆమెను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులపై అనుచితంగా ప్రవర్తించిన కారణంగా, ఎస్సై ఫిర్యాదు మేరకు షర్మిల కేసు విషయంలో ముందుకు వెళ్తామని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. కాగా అంతకుముందు సిట్ అధికారులను కలవడానికి వెళుతున్నానని పేర్కొన్న షర్మిలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వైయస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై మండిపడిన వైఎస్ షర్మిల పోలీసులకు పని లేకపోతే గాడిదలు కాసుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి పోలీసులు తాము అదే పనిచేస్తున్నామని వైయస్ షర్మిల కు కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళను, పురుష పోలీసులు ఏవిధంగా అడ్డుకుంటారని వైయస్ షర్మిల వారిని ప్రశ్నించారు. ఆపై వాహనంలో వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వాహనానికి అడ్డుపడ్డారు. అనంతరం వాహనం దిగిన వైఎస్ షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, వారిపై చేయి చేసుకున్నారు. పోలీసులను కొట్టటంపై ఆత్మరక్షణ తన బాధ్యత అంటూ ఆపై వైయస్ షర్మిల చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)