టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. పరీక్షల రద్దు, వాయిదా సబబేనని తెలిపింది. ఉన్నత న్యాయస్థానంలో సోమవారం ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పైన విచారణ జరిగింది. ఈ వివాదంలో సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదని కాంగ్రెస్ నేత తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ చేస్తున్న దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి ఉందని, మంత్రి కేటీఆర్ జోక్యం ఉంటోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సిట్ స్వతహాగా కాకుండా కేటీఆర్ చెప్పినట్లు దర్యాప్తు చేస్తోందన్నారు. లీకేజీలో ఇద్దరి పాత్ర ఉందని కేటీఆర్ ముందే చేప్పారన్నారు. అంతే కాదు ఐటీ అంశాలపై దర్యాప్తు చేసేందుకు సిట్‌లో సరైన సాంకేతిక నిపుణులు లేరన్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సిట్ 40 మంది సాక్షులను ప్రశ్నించిందని ప్రభుత్వం తరఫున ఏజీ హైకోర్టుకు తెలిపారు. అంతే కాదు విచారణలో భాగంగా 12 కంప్యూటర్లను సిట్ సీజ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ధర్మాసనం విచారణలో భాగంగా స్పందిస్తూ..సిట్‌లో ఐటీ నిపుణులు ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఐటీ విషయాలపై దర్యాప్తు చేసేందుకు ఔట్ సోర్సింగ్‌కు వెళ్తారా అని అడిగింది. అంతే కాదు పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ , బీజేపీ నాయకులను ఎందుకు ప్రశ్నించారంది. వారి నుంచి ఏదైనా సమాచారం లభించిందా అని ఆరాతీసింది. అనంతరం ఈ నెల 28న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
పరీక్షల రద్దు, వాయిదా సబబే !
April 24, 2023
0
Tags