వరస సెలవులు రావడం, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల తాకిడి ఏర్పడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 13 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. శనివారం 81,305 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 34,342 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మేలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ జూలై 15వ తేదీ వరకు కొనసాగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, 300 రూపాయల దర్శనం టికెట్ల సంఖ్యను కుదించారు. తిరుమలలో దాదాపు 7,400 గదులు, నాలుగు భక్తుల సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 40,000 మందికి సరిపడేలా వసతి అందుబాటులో ఉంది. ఇందులో 85 శాతం గదులను సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తోన్నారు. తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకున్న వారు మాత్రమే స్వయంగా ఏఆర్‌పీ కౌంటర్‌లో స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి గది కేటాయించినట్టుగా రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కు మెసేజ్ అందిన తరువాతే సంబంధిత సబ్ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాల్సి ఉంటుంది. రెండు గంటల్లోపు సదరు భక్తుడు గదిని తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుంది. గదికి చెల్లించిన అద్దె మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. కాషన్ డిపాజిట్ మాత్రమే తిరిగి చెల్లిస్తారు. గదుల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని, మధ్యవర్తులను, దళారీలను కట్టడి చేసి భక్తులకు గదులు అందుబాటులో ఉంచడానికి వీలుగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందించే ఏర్పాట్లు చేశారు. నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించడానికి చలువ పందిళ్లు, కార్పెట్లు వేశారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లను ఏర్పాట్లు చేశారు. వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల్లో భక్తుల కోసం అన్నప్రసాద కేంద్రాలను టీటీడీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాహార్తిని తీర్చడానికి అన్ని ముఖ్య ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచారు. భక్తులకు కొరత లేకుండా చాలినన్ని లడ్డూ నిల్వలను సిద్ధం చేస్తున్నారు.
వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలలో విస్తృత ఏర్పాట్లు
April 16, 2023
0
Tags