ఉద్యోగుల కోసం సింగపూర్ కొత్త వీసా రూల్స్ !

Telugu Lo Computer
0


ఆర్ధిక మాంద్యం భయాల నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో కీలక వర్క్ ఫోర్స్‌లో నిపుణుల కొరత ఉంటుందేమోనని కొన్ని దేశాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ వీసా రూల్స్ మారుస్తున్నాయి. ఇటీవలే విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు డెన్మార్క్‌ వీసా స్కీమ్‌లో కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో సింగపూర్‌ కూడా చేరింది. ఈ దేశం త్వరలోనే కొత్త వీసా స్కీమ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. వివిధ రంగాలకు చెందిన మరింత మంది విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు సింగపూర్ సెప్టెంబర్‌లో కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టనుంది. విదేశీ నిపుణులకు వర్క్‌ వీసా అయిన ఎంప్లాయ్‌మెంట్ పాస్ కోసం ఈ స్కీమ్‌ ద్వారా అభ్యర్థులను సెలక్ట్‌ చేస్తారు. అభ్యర్థుల నైపుణ్యాలు, అనుభవం వంటి వివరాల ఆధారంగా, వారి ఎలిజిబిలిటీని అంచనా వేయడానికి అసెస్‌మెంట్‌, కాంప్లిమెంటరిటీ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క అనే పాయింట్-బేస్డ్‌ సిస్టమ్‌ని ఉపయోగిస్తారు. స్థానికులతో కలిసి పని చేయగల నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను ఆకర్షించడం, దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో సింగపూర్‌ కొత్త వర్క్ వీసా రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. సింగపూర్‌లో ఎంప్లాయ్‌మెంట్ పాస్ కోసం కొత్త దరఖాస్తుదారులు జీతం, అర్హతలు, కంపెనీ డైవర్సిటీ, స్థానిక సిబ్బంది నిష్పత్తులకు సంబంధించిన నాలుగు ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా 40 పాయింట్లను స్కోర్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులతో సహా ఆరు పరిశ్రమల్లోని 27 ఉద్యోగాలకు బోనస్ పాయింట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సింగపూర్‌లో డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణల ద్వారా ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలకు దోహదం చేసే కంపెనీలు కూడా బోనస్ పాయింట్లను అందుకుంటాయి. కొత్త వీసా పథకం దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే మార్గాల్లో ఉద్యోగాలను తీసుకునేలా వ్యాపారాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. సింగపూర్‌లోని కొత్త వీసా పథకం ప్రకారం.. అధిక స్కోరు సాధించడానికి యజమానులు వర్క్‌ప్లేస్‌ డైవర్సిటీని నిర్ధారించాలి. దీని మేరకు విభిన్న నేపథ్యాల నుంచి కార్మికులకు అవకాశాలు కల్పించాలి. అదే విధంగా గణనీయమైన సంఖ్యలో సింగపూర్ కార్మికులను నియమించుకోవాలి. ఇది స్థానిక శ్రామిక శక్తిని బలోపేతం చేస్తుందని, డైవర్సిటీ ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశం కొత్త ఆర్థిక అవకాశాలను కోరుకుంటున్న నేపథ్యంలో, ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి వ్యాపారాలకు నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమని సింగపూర్‌లోని మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాన్‌పవర్ అభిప్రాయపడింది. స్థానిక శ్రామిక శక్తి పరిమితంగా ఉండటం, ట్యాలెంటెడ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతోందని, నైపుణ్యం కలిగిన కార్మికుల డిమాండ్‌ను విదేశీ కార్మికులతో తీర్చుకోవాలని తెలిపింది. సింగపూర్‌లో మొత్తం 5.64 మిలియన్ల జనాభాలో నాలుగింట ఒక వంతు మంది విదేశీ కార్మికులు ఉన్నారు. కొత్త వీసా పథకం ఎంప్లాయ్‌మెంట్ పాస్ కి వర్తిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)