గాంధీజీ మరణం, దేశంలో ఆనాటి మతపరిస్థితులు, హిందూ-ముస్లిం సమైఖ్యతకు గాంధీజీ చేసిన కృషి, హిందూ అతివాదులకు అది నచ్చకపోవడం, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను దేశంలో నిషేధించిన ఘటనల గురించి వివరించే అనేక పాఠాలను 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఈ అంశాలు లేని పాఠ్యపుస్తకాలు వచ్చే విద్యాసంవత్సరంలో టీ రానున్నాయి. తొలగించిన వాటిలో గుజరాత్ అల్లర్లు, మొఘల్ కోర్టులు, అత్యయిక పరిస్థితి, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్ ఉద్యమం వంటి అంశాలు కూడా ఉన్నాయి. అయితే తొలగించిన అంశాలన్నీ ఇప్పటి పరిస్థితులకు సంబంధం లేనివని ఎన్సీఈఆర్టీ చెబుతోంది. ఈ తొలగింపు ప్రక్రియ 2022 జూన్‌లోనే జరిగిందని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఇలా చేశామని తెలిపింది. పాఠ్యాంశాల తొలగింపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్రం చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని, చరిత్రను మార్చాలనుకొనేవారు, ఆ చరిత్రలోనే కలిసిపోతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఎంత ప్రయత్నించినా దేశ చరిత్రను చెరిపివేయలేరన్నారు. ప్రధాని మోడీ చెప్పుకొనే 'ఆధునిక భారతం' 2014 నుంచి ప్రారంభం అయిందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. చరిత్రను మార్చే ప్రయత్నాలు తీవ్రమయ్యాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. మరోవైపు మొఘల్ చరిత్రను పుస్తకాల నుంచి తొలగించాలన్న కేంద్ర నిర్ణయం బాటలోనే రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించింది. తాజాగా ఉత్తరాఖండ్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొఘల్ చరిత్ర పాఠాలను తొలగించనుంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.
'గాంధీజీ మరణం' పాఠాలు తొలగింపు !
April 06, 2023
0
Tags