యర్రగొండపాలెంలో ఉద్రిక్తత !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నేతృత్వంలోని కార్యకర్తలు ప్రయత్నించారు. చంద్రబాబు వచ్చే మార్గంలో ప్లకార్డులు, నల్లజెండాలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఎస్సీలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. వైకాపా కార్యకర్తల నిరసనలతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు. గతంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే యర్రగొండ పాలెంలో అడుగుపెట్టనీయబోమని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మరోవైపు యర్రగొండపాలెంలో తెదేపా శ్రేణులు సైతం భారీగా మోహరించాయి. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చినవారిని పోలీసులు నిలువరించారు. దీంతో తమను పంపాలంటూ తెదేపా శ్రేణులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తెదేపా సీనియర్‌ నేత మన్నె రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. మార్కాపురం పర్యటన పూర్తి చేసిన చంద్రబాబు.. యర్రగొండపాలెంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం 'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి' పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)