ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా దేశ వ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్ మీటర్లను ఈ నెల 28న వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఈ ట్రాన్స్ మీటర్లన్నీ 100 వాట్ల ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లు. వీటిలో 4 ట్రాన్స్ మీటర్లు తెలంగాణ లోని నల్గొండ, దేవరకొండ, రామగుండం, సిర్పూర్ లలో ప్రారంభం అవుతున్నాయి. ప్రతి ట్రాన్స్ మీటరు 20 కిలో మీటర్ల పరిధి వరకు ప్రసారాలు చేయగలవు. ఆకాశవాణి ఎఫ్ఎం సేవలను ఈ ట్రాన్స్ మీటర్లు మరింత విస్తరించి, సమాచారాన్నీ, వినోదాన్నీ ప్రజలకు అందించటానికి దోహదం చేస్తాయి. వీటి ఫ్రీక్వెన్సీ 100.1 మెగా హెర్జ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో ఆకాశవాణి ద్వారా పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం వంద చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండలం నుంచి బూత్ స్థాయి వరకూ ఈ కార్యక్రమాలుంటాయని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా వంద రూపాయల నాణెం విడుదల చేయనుంది. 2014 అక్టోబర్ 3న విజయదశమి వేళ మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, నీటి సంరక్షణ, వోకల్ ఫర్ లోకల్ వంటి ఎన్నో అంశాలను ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణికి ప్రకటనల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చింది.
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా 91 ఆకాశవాణి ట్రాన్స్ మీటర్ల ప్రారంభం !
April 26, 2023
0
Tags