అమరావతి ఆర్ 5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్ధలాలు కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై వివాదం నెలకొంది. అమరావతిలో ఆర్ 5 జోన్ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్ధలాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తూ వైసీపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 45పై ఇవాళ హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. రాజధాని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గుర్తుచేశారు. పిటిషనర్ తరపు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దేవదత్ కామత్, లాయర్లు ఆంజనేయులు, ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. కానీ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని, అక్కడికి వెళ్లొచ్చు కదా అని సూచించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ప్రశ్నించింది. దీంతో కేవలం రాజధాని భూములపై మాత్రమే మాట్లాడుతున్నట్లు లాయర్లు తెలిపారు. రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయ సమ్మతం కాదన్నారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ లోపు ప్రభుత్వం, సీఆర్డీయే కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)