మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై కాలువలో బస్సు పడిపోవడంతో దాదాపు 12 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. పూణె నుంచి ముంబైకి సంగీత బృందంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు తెల్లవారుజామున 4.50 గంటలకు శింగ్రోవా దేవాలయం సమీపంలోని హైవేపై లోయలో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గోరేగావ్‌కు చెందిన 'బాజీ ప్రభు వడక్ గ్రూప్'కు చెందిన సభ్యులు ఈ బస్సులో ఉన్నారు. పూణె జిల్లాలోని పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి గోరేగావ్‌కు పయనమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు బస్సు వేదిక నుండి బయలుదేరింది. మృతుల్లో ఎక్కువగా సియోన్, గోరేగావ్, పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతాలకు చెందినవారేనని రాయ్‌ఘడ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. గాయపడిన వారిని ఖోపోలి గ్రామీణ ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. మృతుల వయస్సు ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పుకొచ్చారు. స్థానిక పోలీసుల బృందం, ట్రాకర్ల బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉంది. ఖోపోలి అనే ఈ పట్టణం ముంబై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
బస్సు లోయలో పడి 12 మంది మృతి
April 15, 2023
0
Tags