టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్గొండలో పోలీసులు కేసు నమోదు చేశారు. చెరుకు సుధాకర్, ఆయన కుమారుడిపై వెంకట్ రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యల కాల్ రికార్డులు ఇటీవల దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్యలు తాను భావోద్వేగంతోనే చేసినవని, వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని వెంకట్ రెడ్డి ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు. తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. 33 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ తన రాజకీయ ప్రత్యర్థులు, ఇతరులపై కానీ దూషణలు చేయలేదని చెప్పారు. శత్రువులను కూడా దగ్గరకు తీసే తత్వం తనదన్నారు. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. నల్గొండ మున్సిపాలిటీ మూడుసార్లు జనరల్ అయినా.. పట్టుబట్టి మూడుసార్లు కూడా బలహీన వర్గాలకు దక్కేలా చూశానని కోమటిరెడ్డి తెలిపారు. తాను మాట్లాడిన అన్ని విషయాలు కట్ చేసి.. కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేశారని తెలిపారు. రికార్డు చేస్తున్నారని తనకు తెలుసని.. పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతున్నాడని ఆరోపించారు. తనను సస్పెండ్ చేయాలని అనడం వల్లే బాధతో మాట్లాడినట్లు వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. నకిరేకల్ లో తనపై పోస్టర్లు వేశారని.. అవి ఎవరు వేశారో తనకు తెలుసన్నారు. తమ వాళ్లు చంపేస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పినట్లు తెలిపారు కోమటిరెడ్డి. నపై చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు, చెరుకు సుధాకర్ మాత్రం బెదిరింపుల అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సుధాకర్ కుమారుడు సుహాస్ సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని సుహాస్ తెలిపారు. చంపుతానంటూ ఫోన్లో బెదిరించినట్లు చేసిన ఫిర్యాదు మేరకు నల్గొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో 506 సెక్షన్ కింద కేసు నమోదైంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు
March 07, 2023
0
Tags