భారత్ గురించి ప్రపంచమంతా కీర్తిస్తుంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారంటూ భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. 'నాకు గుర్తున్నాయ్' అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'స్వాతంత్య్రం వచ్చిన 60 నుంచి 70 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదని విదేశాల్లో ప్రధాని మోడీ ప్రకటించడం నాకు గుర్తుంది. ఆ కాలంలో అపరిమిత స్థాయిలో అవినీతి జరిగిందని ఆయన చెప్పడం నాకు గుర్తుంది. నేనెప్పుడు నా దేశం పరువు తీయలేదు. అలా చేయాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. నా మాటలను వక్రీకరించడం భాజపాకు ఇష్టం. ఫర్వాలేదులే..! కానీ విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసే వ్యక్తి ప్రధాని అనేది మాత్రం వాస్తవం. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆయన చేసిన ప్రసంగం మీరు వినలేదా..? ఆ మాటలతో ఆయన భారతీయులను అవమానించారు 'అంటూ రాహుల్ స్పందించారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోని గత ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్యలున్నాయంటూ 2015లో దుబాయ్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలను అప్పట్లో కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. 'గతంలో భారతీయులు ఇక్కడ జన్మించినందుకు చింతిస్తూ దేశం విడిచివెళ్లిపోయే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఆదాయం తక్కువైనా తిరిగి స్వదేశానికి రావడానికే మొగ్గుచూపుతున్నారు. ప్రజల ఆలోచన మారింది' అంటూ అదే ఏడాది విదేశీ గడ్డపై మోడీ వ్యాఖ్యలు చేశారు.
భారత్ పరువు తీసింది మోడీనే !
March 06, 2023
0
Tags