చెన్నైలో 2026 నాటికి డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లు !

Telugu Lo Computer
0


2026 నాటికి చెన్నైలో డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రద్దీని నియంత్రించి, ప్రజలకు మెరుగైన రవాణా సేవలందించేలా ఉత్తర, మధ్య, దక్షిణ చెన్నైలను కలుపుతూ తొలివిడతలో మెట్రోరైళ్లు నడుపుతున్నారు. విమానాశ్రయం-వింకోనగర్‌, సెంట్రల్‌-సెయింట్‌ థామస్‌ మౌంట్‌ మార్గాల్లో సుమారు 55 కి.మీ దూరానికి నడుపుతున్న మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రజల్లో మెట్రో రైళ్లకు మంచి ఆదరణ  రావడంతో తాజాగా 118.9 కి.మీ వరకు మూడు మార్గాల్లో రెండో విడత పనులను సీఎంఆర్‌ఎల్‌ సంస్థ ప్రారంభించింది. మాధవరం-షోలింగనల్లూర్‌, మాధవరం-సిరుసేరి, సిప్కాట్‌, పూందమల్లి- లైట్‌హౌస్‌ వరకు మెట్రోరైలు పనులు జరుగుతున్నాయి. ఈ కొత్త మార్గంలో డ్రైవర్లు లేకుండా మెట్రోరైళ్లు నడిపేందుకు సీఎంఆర్‌ఎల్‌ నిర్ణయించింది. ఆ మేరకు లైట్‌ హౌస్‌-పూందమల్లి బైపాస్‌ రోడ్డు వరకు 26.1 కి.మీ దూరానికి నిర్మిస్తున్న మార్గంలో 2026లో తొలి డ్రైవర్‌ రహిత మెట్రోరైలు సేవలను ప్రారంభించనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు. ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర సమయాల్లో రైళ్లు నిలపడం, తలుపులు తెరచుకొని ప్రయాణికులు సత్వరం దిగే తదితర సదుపాయాలు ఈ రైళ్లలో ఉంటాయన్నారు. వచ్చే ఏడాది మార్చిలో 10 నుంచి 12 నెలల వరకు డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ల ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)