భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్ ?

Telugu Lo Computer
0


తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఆన్ లైన్ - ఆఫ్ లైన్ సేవల ద్వారా భక్తులకు టికెట్లు జారీ చేస్తున్నారు. ఇక వసతి గదుల మొదలు శ్రీవారి సేవల వరకు అన్నింటకీ ఒకే చోట అందుబాటులో ఉంచేలా టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది. తిరుమలకు వచ్చే భక్తులకు కావాల్సిన పూర్తి సమాచారం ఒకే చోట లభించేలా టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమల కొండకు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా ఒక యాప్ ను  టీటీడీ ఐటీ విభాగంసిద్దం చేస్తోంది. తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఇందులో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గదులు బుక్ చేయటం తో పాటుగా ఏ సమయంలో ఏ మేర అందుబాటులో ఉన్నాయనే సమాచారం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి సంబంధించి టీటీడీలో పని చేసే ఐటీ అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈ యాప్ రూపకల్పన దాదాపు పూర్తయినట్లు సమాచారం. కొంత కాలం క్రితం టీటీడీ అధికారులు గోవింద యాప్ ను తీసుకొచ్చారు. కానీ, దాని వలన భక్తులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో, ఇప్పుడు నిత్యం భక్తులకు కావాల్సిన సమాచారం తో కొత్త యాప్ సిద్దం అవుతోంది. కొత్తగా తీసుకొస్తున్న యాప్ ద్వారా భక్తులకు మరో అరుదైన అవకాశం దక్కనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీటీడీ వెబ్ సైట్ ద్వారా దర్శనం..వసతి తో పాటుగా అందుబాటులో ఉన్న తేదీల్లో శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కానీ, కొత్తగా అందుబాటులోకి వస్తున్న యాప్ ద్వారా భక్తులు సులభంగా గదులు..శ్రీవారి దర్శన టికెట్లు పొందే అవకాశం లభిస్తుంది. దీంతో పాటుగా ఈ యాప్ ద్వారా శ్రీవారి సేవలు జరిగే సమయంలోనే సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భక్తులకు లభించే అరుదైన అవకాశంగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ముక్కోటికి వచ్చే భక్తులకు ఏర్పాట్లలో నిమగ్నమైన టీటీడీ త్వరలోనే ఈ యాప్ ను అధికారికంగా అందుబాటులోకి తీసుకు రానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)