కర్ణాటకలోని బెంగళూరు, హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడిన వృద్ధుని, బాలిక బంధువుల దాడిలో విగత జీవి అయ్యాడు. తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్ గుళేద్ కేసు వివరాలను వెల్లడించారు. కుప్పణ్ణ గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. కుప్పణ్ణ ఉండే ఇంటి పై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో బాలిక వివరంగా చెప్పడంతో బంధువులు అగ్రహోదగ్రులయ్యారు. వెంటనే వెళ్లి కుప్పణ్ణను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు.
బాలికపై వృద్ధుడు అఘాయిత్యం - బంధువుల దాడిలో వృద్ధుని మృతి
December 13, 2022
0
Tags