ఉస్మానియా ఐసీయూలో ఊడిపడిన ఫాల్స్‌ సీలింగ్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ పడకల వార్డు పనుల్లో డొల్లతనం బయటపడింది. మూడు రోజుల వర్షానికే వార్డులో లీకేజీలు బయటపడుతున్నాయి. ఓపీ రిజిస్ట్రేషన్‌ వద్ద ఫాల్స్‌ సీలింగ్‌ సైతం కూలి కిందపడింది. మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం లక్షలాది రూపాయలను కేటాయిస్తుంటే లోపభూయిష్టమైన పనులతో నిధులు వృథా అవుతున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పాతభవనం శిథిలం కావడంతో అక్కడి నుంచి రోగులను ఓపీ భవనం, కులీకుతుబ్‌షా భవనాలకు తరలించారు. వర్షం పడితే ఓపీ భవనంలో లీకేజీలయ్యే పరిస్థితి ఉండడంతో మూడు నెలల క్రితమే ఓపీ బ్లాక్‌ను అత్యంత ఆధునికంగా తయారు చేశారు. ప్రత్యేకంగా 20 పడకల ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. వీటిని ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చారు. వర్షానికి ఆదివారం కొత్త ఐసీయూ వార్డులో నీళ్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఓపీ రిజిస్ట్రేషన్‌ వద్ద ఫాల్స్‌ సీలింగ్‌ ఊడి కిందపడింది. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)