స్పైస్‌జెట్ విమానంలో మంటలు

Telugu Lo Computer
0


బీహార్‌ రాజధాని పాట్నాలో స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737-800 విమానం ఆదివారం 185 మంది ప్రయాణికులతో పాట్నా ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి టేకాఫ్‌ అయ్యింది. అయితే విమానం ఇంజిన్‌ నుంచి మంటలు, పొగలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విమానాన్ని వెంటనే పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు రప్పించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఆ విమానంలోని 185 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పాట్నా ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఈ సంఘటనపై స్పైస్‌జెట్ కూడా వివరణ ఇచ్చింది. విమానం టేకాఫ్‌ కాగానే ఎడమ వైపు ఉన్న ఇంజిన్‌ను ఒక పక్షి ఢీకొట్టిందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆ ఇంజిన్‌లో మంటలు రావడాన్ని గమనించిన కేబిన్‌ సిబ్బంది వెంటనే పైలట్లను అలెర్ట్‌ చేసినట్లు చెప్పారు. పైలట్లు వెంటనే ఆ ఇంజిన్‌ను ఆపి వేశారని, అనంతరం విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత మరో స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణికులను ఢిల్లీకి చేర్చినట్లు వివరించారు. విమానం ఇంజిన్‌లో మంటలు రావడానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. స్పైస్‌జెట్ విమానం రెక్క వద్ద ఇంజిన్‌ నుంచి మంటలు, పొగలను గమనించిన పాట్నా ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కొందరు స్థానికులు తమ మొబైల్‌లో రికార్డు చేసిన వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)