మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌?

Telugu Lo Computer
0


మనుషుల రక్తంలోమొదటిసారి ప్లాస్టిక్‌ను గుర్తించినట్లు డచ్ పరిశోధకులు వెల్లడించారు. తాము పరీక్షించిన ప్రతి పదిమందిలో ఎనిమిది మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు వారు తేల్చారు. చాలామంది రక్తంలో పాలిథిలీన్‌ టెరాఫ్తలేట్ (పీఈటీ) ఉన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత గృహోపకరణాలకు వాడే పాలిస్టిరీన్ ఉన్నట్లు చెప్పారు. తాము పరీక్షించిన 77 శాతం మంది రక్తప్రవాహంలో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు వెల్లడించారు. వాటర్ ప్యాకెట్లు, డ్రింక్స్‌, ఆహారం ప్యాకేజీకి వాడే పాలిథిలీన్‌ టెరాఫ్తలేట్ (పీఈటీ) ఎక్కువ మంది రక్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్లాస్టిక్ కణాలు గాలి, ఆహారం, నీరు, డ్రింక్స్ ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. పరిశోధనా ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెస్టర్‌డామ్‌ లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ అన్నారు. చాలామంది తమకు తెలియకుండానే ప్లాస్టిక్ కణాలను పీల్చుకుంటున్నారని, ఇవి రక్తంలో చేరిపోతున్నాయని వెల్లడించారు. వీటివల్ల దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ ఏర్పడే ప్రమాదముందన్నారు. ఇది రక్తపోటుకు దారితీయొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. పరిశోధకులు 22 మంది రక్తం సేకరించి, పరీక్షించారు. ఈ 22 మందిలో 17 మంది రక్తంలో గుర్తించదగిన మోతాదులో ప్లాస్టిక్ కణాలున్నట్లు గుర్తించారు. వీరి రక్తంలో మొత్తం ఐదు రకాల ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. పాలీప్రొఫిలీన్‌, పాలిస్టిరీన్‌, పాలీమిథైల్ మెథాక్రిలేట్‌, పాలిథిలీన్‌, పాలిథిలీన్ టెరాఫ్తలేట్ (పీఈటీ)లాంటి ఐదు రకాల ప్లాస్టిక్‌లను గుర్తించారు. పాలిథిలీన్ టెరాఫ్తలేట్ తర్వాత పాలిస్టిరీన్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తేల్చారు. ఈ రెండింటి తర్వాత క్యారీ బ్యాగ్స్ తయారీకి వాడే పాలిథిలీన్ ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. రక్తపరీక్షలు చేసిన 50శాతం మందిలో పాలిథిలీన్ టెరాఫ్తలేట్ ఉన్నట్లు గుర్తించారు. 36 శాతం మందిలో పాలిస్టిరీన్ ఉన్నట్లు తేల్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)