,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళ మంత్రి, భారతదేశపు తొలి ముస్లిం మహిళ మంత్రి. మాసూమా బేగం. హైదరాబాదీ అయిన మాసూమా బేగం చిన్నప్పట్నుంచే సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజనీనాయుడితో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన అఖిల భారత మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుండి 1957 లో పట్టర్ ఘట్టి నుండి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో పత్తర్‌గట్టి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1960 జనవరిలో రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గా పని చేశారు. 1962లో తిరిగి పత్తర్‌ఘట్టి నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి సలావుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయింది. ఈమె కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. ప్రపంచంలో ద్వేషం, అసూయ నిర్మూలించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సంఘంలో వీరు సభ్యురాలు. మసూమా బేగం హైదరాబాదులో విద్యావంతుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి తయ్యబా బేగం, భారతదేశపు ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు. ఈమె మాతామహుడు హైదరాబాదులో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడైన ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ. ఈమె సోదరుడు అలీ యావర్ జంగ్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. మసూమా విద్యాభ్యాసం మహబూబీయా బాలికల పాఠశాలలో జరిగింది. వీరు ఇరవై సంవత్సరాల వయసులో 1921లో తల్లి తయ్యబా బేగం మరణించడంతో, తల్లిచే స్థాపించబడిన "అంజుమన్-ఏ-ఖవాతీన్" అనే జాతీయ మహిళా సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.1922లో ఈమె ఆక్స్‌ఫర్డులో చదివి తిరిగివచ్చిన తరువాత తన బంధువు హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసుకొంది. ఈమె భర్త ఆ తరువాతి కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి ఐదుగురు సంతానం.మసూమా బేగం 1990, మార్చి 2 న హైదరాబాదులో మరణించారు.