ప్రపంచవ్యాప్తంగా పాపులరైన తబ్లిగీ జమాత్ ను తమ దేశంలో నిషేధిస్తూ సౌదీ రాజప్రసాదం ప్రకటన చేసింది. అంతేకాదు, తబ్లిగీ జమాత్ సమాజానికి ముప్పు అని, ఆ సమావేశాలు టెర్రరిజానికి దగ్గరి దారులయ్యాయంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. సౌదీలో తబ్లిగీ నిషేధానికి సంబంధించి ఆ దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇస్లామ్ అధికారిక మతంగా ఉన్న గల్ఫ్ దేశాల్లోకెల్లా సంపన్న దేశంగా ఉన్న సౌదీ.. ఇటు ఆసియాదేశాలతోనేకాక అటు పాశ్చత్య దేశాలతో దగ్గరి సంబంధాలు కొనసాగిస్తూనే తనదైన మత సంస్కృతిని కొనసాగిస్తున్నది. అయితే ఆధునిక ప్రపంచంలో మానవాళికి ముప్పుగా మారిన టెర్రరిజం పట్ల, అందునా ఇస్లామిక్ టెర్రరిజం పట్ల సౌదీ జీరో టోలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నది. ఈ క్రమంలో తబ్లిగీ జమాత్ ను సైతం నిషేధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి తబ్లిగీ జమాత్ ఒక మార్గమని, తబ్లిగీ జమాత్ వల్ల సమాజానికి ముప్పు పొంచి ఉందన్న సౌదీ అరేబియా సర్కారు ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సింది మీరేనంటూ దేశంలోని మసీదులు, ముస్లిం మత బోధకులను ఆదేశించింది. సౌదీలోని మసీదులు, మత పెద్దలు తబ్లిగీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ అల్ షేక్ ప్రకటనలో పేర్కొన్నారు. భగవంతుడికి సంబంధించిన విషయాలు చెప్పేవారు (తబ్లిగీ) నిర్వహించే సంస్థ (జమాత్)ను తబ్లిగీ జమాత్ గా పిలుస్తారు. నిజానికి ఈ సంస్థ 1926లో భారత్ లోనే ప్రారంభమైంది. ముస్లింలు అందరూ స్వచ్ఛమైన ఇస్లాంకు తిరిగిరావాలనే లక్ష్యంతో 1926లో మౌలానా మహ్మద్ ఇలియాస్ తబ్లిగీ జమాత్ ఉద్యమాన్ని హర్యానాలోని నుహూలో ప్రారంభించారు. కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో తబ్లిగీ జమాత్ శాఖలు ఏర్పడ్డాయి. తబ్లిగీ జమాత్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35-30 కోట్ల మంది ముస్లింలు తబ్లిగీని అనుసరిస్తున్నట్లు సమాచారం. ఇండోనేసియా, మలేసియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాల్లో తబ్లిగీలు కోట్లల్లో ఉన్నారు. భారత్ లోని పలు ప్రాంతాల్లో ఏటా తబ్లిగీ జమాత్ భారీ ఎత్తున మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2020లో తబ్లిగీ సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దరిమిలా ఆ సంస్థ పతాక శీర్షికలకు ఎక్కింది.
తబ్లిగీ జమాత్‌పై సౌదీ అరేబియా నిషేధం
December 13, 2021
0
Tags