బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఓడ ప్రయాణికులతో వెళుతున్న పడవను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 21 మంది మరణించగా, 50మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో తొమ్మిది మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారి హయ్యత్-ఉద్-దోలా అన్నారు. రాజధాని ఢాకాకు 82కిలోమీటర్ల దూరంలోని బిజోరునగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బ్రాహ్మ్రన్‌బరియా జిల్లాలోని చెరువులో శుక్రవారం రాత్రి 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను సరుకును తరలిస్తున్న ఒక ఓడ ఢీ కొట్టింది . వెంటనే పడవ బోల్తా పడి మునిగిపోయినట్లు స్థానికులు అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగిన రెండు వేర్వేరు పడవ బోల్తా ఘటనల్లో 54 మంది మరణించిన సంగతి తెలిసిందే.