నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా మందు’ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొవిడ్ రోగుల పాలిట దివ్య ఔషధంగా పేర్కొంటున్న ఈ మందుకు డిమాండ్ పెరుగుతుంది. దీని కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. నేటి నుంచి మందుని పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటనతో వేలాది మంది వాహనాలలో తరలి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో క్యూలైన్లో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
కృష్ణపట్నంలో కరోనా మందు తయారీదారుడి పేరు బొరిగి ఆనందయ్య. ఈ కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నారు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో ప్రజలు రాగా.. ఇప్పుడు నిత్యం 4-5వేల మంది వరకు వస్తున్నారు.
ఆయుష్ ల్యాబ్ నుండి గురువారం రాత్రి వచ్చిన రిపోర్టుల ప్రకారం ఈ మందులు హానికరం కావని తేలింది. అలాగే ప్రమాణాలకు లోబడి కూడా ఉందని రిపోర్టులో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంకొన్ని రిపోర్టులకు రెండు రోజులు పట్టొచ్చు. అప్పటివరకు ప్రభుత్వం ఈ మందుల పంపిణీకి అనుమతి ఇవ్వదు. అయితే స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రం శుక్రవారం నుంచి మందులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
అయితే ఈ మందు శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలిపివేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్ ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే పరీక్షల్లో ఈ మందు హానికరమైనది కాదని తేలడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. శుక్రవారం నుంచి ఆయుర్వేద మందు పంపిణీని తిరిగి చేపట్టవచ్చని తెలిపింది.