2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, 2025 అక్టోబర్ 18 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే పరీక్ష ఫీజును కూడా చెల్లించవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కోసం 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 22లోపు విద్యార్థుల ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల డౌన్‌లోడ్ కాపీలు, ఫీజు రసీదులు, నామినల్ రోల్స్‌ను రెండు కాపీలు చొప్పున సంబంధిత జిల్లా విద్యా అధికారికి సమర్పించాలి. తదుపరి, డీఈఓలు ధ్రువీకరించిన పత్రాలను అక్టోబర్ 24 లోపు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌ను ప్రతి సంవత్సరం అందిస్తోంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం పొందుతారు. పేద విద్యార్థులు 8వ తరగతి తర్వాత చదువు మానేయకుండా ఉండేందుకు, వారిని ప్రోత్సహించి విద్యను కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ అమలులో ఉంది. అర్హులైన విద్యార్థులు నిర్దేశిత తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంపు
October 16, 2025
0
Tags