జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచార పర్వం మొదలు పెట్టాయి. జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరును ఇదివరకే పార్టీ హై కమాండ్ ప్రకటించింది. ఇవాళో రేపో బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు. దీంతో జూబ్లీహిల్స్ లో నెల రోజుల ముందు నుంచే ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్న ప్రచారం నిర్వహించారు. బస్తీలోని గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్లు అడిగారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ప్రచారంలో ఆయన చేసిన సందడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. చాయ్ దుకాణంలో మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అక్కడి ఓటర్లకు టీ అందించారు. కాలనీలు మొత్తం కలియతిరిగారు. ఒక సెలూన్ లో హెయిర్ కట్ చేస్తూ ఓటు అభ్యర్థించారు. మరోసారి ఓ ఇంటి ముందు పాపను ఎత్తుకుని డ్యాన్స్ చేశారు. ఇలా మల్లారెడ్డి ప్రచారం సరదాగా సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు గ్యారంటీ కార్డును మల్లారెడ్డి అందించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారెంటీ కార్డుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాకీ కార్డును మల్లారెడ్డి ఓటర్లకు అందించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఈ మేరకు 'కారు గుర్తుకే మన ఓటు, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. మాగంటి సునీత నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
జూబ్లీహిల్స్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్న ప్రచారం : వైరల్ వీడియో
October 14, 2025
0
Tags