పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ టీమిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అని, కానీ వారి చర్యలే చిల్లరగా ఉన్నాయని విమర్శించాడు. ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించడాన్ని బసిత్ అలీ తప్పుబట్టాడు. ఈ పనులతో ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ట్రోఫీ లేకుండానే భారత్ విజయ సంబరాలు చేసుకుంది. స్వదేశానికి తిరిగొచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న నఖ్వీ పాకిస్థాన్ మంత్రిగా కూడా కొనసాగుతున్నాడని, ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేమని టీమిండియా స్పష్టం చేసింది. మరోవైపు తన చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాలని, ఏసీసీ ప్రెసిడెంట్‌గా ట్రోఫీ ప్రదానం చేయడం తన హక్కు అని నఖ్వీ పట్టుబట్టాడు. చివరకు ట్రోఫీ అందుకోవడానికి భారత్ ముందుకు రాకపోవడంతో నఖ్వీ దాన్ని తీసుకోని వెళ్లిపోయాడు.
నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించడాన్ని తప్పుబట్టిన పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ
October 02, 2025
0
Tags