భారతీయ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం : రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Telugu Lo Computer
0


భారతీయ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. భారతీయ సినిమాలకు రష్యాలో చాలా పాపులారిటీ ఉందని చెప్పారు. సోచిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్‌ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నామని పుతిన్‌ తెలిపారు. భారత్‌ వెలుపల ఆ దేశానికి చెందిన సినిమాలను నిరంతరం ప్రసారాలు చేస్తున్న ఏకైక దేశం బహుశా రష్యానేనని అన్నారు. రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు మాత్రమే గాక, సాంస్కృతిక, మానవీయ బంధం కూడా బలంగా ఉందని పేర్కొన్నారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుతున్న విషయాన్ని పుతిన్‌ గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా సినిమాలపై రష్యన్‌లు విపరీతమైన ఆసక్తి కనబరుస్తారని అన్నారు. కాగా సోవియట్‌ కాలం నుంచే రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. రాజ్‌కపూర్‌, మిథున్‌ చక్రవర్తి లాంటి బాలీవుడ్‌ స్టార్ల పేర్లు ఇప్పటికీ ప్రతి రష్యన్‌ ఇంట్లో వినిపిస్తాయి. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో పాశ్చాత్య సినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది. దాంతో బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ పెరిగింది. 1982లో మిథున్‌ చక్రవర్తి నటించిన 'డిస్కో డ్యాన్సర్‌' మూవీ సోవియట్‌ యూనియన్‌లో ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమా చూసేందుకు జనాలు బారులు తీరారు. అది అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ సినిమాగా నిలిచింది. ఆ సినిమాలోని 'జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా' అనే పాట రష్యాలో మార్మోగిపోయింది. కాగా, భారతీయ సినిమాలపై పుతిన్‌ తన ప్రేమను వ్యక్తపర్చడం ఇదే తొలిసారి కాదు. గతేడాది బ్రిక్స్‌ సదస్సు సమయంలోనూ ఇండియన్‌ మూవీస్‌పై ఆయన స్పందించారు. ఇండియన్‌ మూవీస్‌ను ప్రచారం చేసేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)