ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్ల మృతికి బీసీసీఐ, ఐసీసీ సంతాపం

Telugu Lo Computer
0


ఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కబీర్ అఘా, సిబ్ఘతుల్లా, హరూన్ అనే యువ క్రీడాకారుల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దారుణ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈ కష్టకాలంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ), క్రీడాకారుల కుటుంబాలకు బీసీసీఐ అండగా నిలుస్తుంది. అమాయకులైన క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం అత్యంత బాధాకరం" అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పెట్టుకోకూడదనే తమ పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఒక స్నేహపూర్వక మ్యాచ్ ఆడి ఇంటికి తిరిగి వెళుతున్న ముగ్గురు యువ ప్రతిభావంతులను పొట్టనపెట్టుకోవడం దారుణమని పేర్కొంది. వారి కుటుంబాలకు, ఆఫ్ఘన్ క్రికెట్ సమాజానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)