ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ గా విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. డ్రీమ్‌ఫోర్స్ అనుబంధ సంస్థ సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. భారత్ లో గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్ మెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అభివర్ణించారు. 2026 నుండి 2030 మధ్యకాలంలో దీన్ని పూర్తి చేస్తామని సుందర్ పిచాయ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలు, కొత్త ఇంధన వనరుల అభివృద్ధి, ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్ వంటివి ఉంటాయని తెలిపారు. అమెరికా వెలుపల తాము చేపట్టిన అతిపెద్ద ఏఐ ఇన్వెస్ట్ మెంట్ ఇదేనని పేర్కొన్నారు. దీనికి 80 శాతం విద్యుత్ ను క్లీన్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని, సబ్- సీ కేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తామని అని పిచాయ్ చెప్పారు. ఇంత భారీ పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం, ప్రత్యేకించి భౌగోళిక, వాతావరణపరంగా అనుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రైలు ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం లాంటి అందమైన తీర ప్రాంత నగరాన్ని చిన్నప్పుడే చూశానని, ఆ నగరంతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, తాను సీఈఓగా ఉంటోన్న గూగుల్ ఇప్పుడక్కడ భారీ పెట్టుబడులు పెడుతోండటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పెట్టుబడి వల్ల ఆ ప్రాంతం పూర్తిగా మారిపోతుందని సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల దీని అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరింత వేగంగా పురోగమించగలవని తెలిపారు. గూగుల్ ఇంటర్నల్ చాట్‌బాట్‌తో సహా ఏఐ ప్రొడక్ట్ మొత్తం విశాఖ డేటా సెంటర్ నుంచే కార్యకలాపాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని అన్నారు. గూగుల్ కంటే ముందుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఓపెన్ఏఐని సుందర్ పిచాయ్ అభినందించారు. తాము అనుకున్నదాని కంటే ముందుగా దీన్ని విడుదల చేశారని గుర్తు చేశారు. గూగుల్ ఇప్పటికే ఏఐ రీసెర్చ్, చిప్ డిజైన్ అండ్ ప్రొడక్ట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని, విశాఖ కూడా దీనికి కిందికే వస్తుందని అన్నారు. చాట్ జీపీటీ ప్రారంభించిన వెంటనే చాట్‌బోట్‌ను విడుదల చేయకూడదని మొదట్లో నిర్ణయించుకున్నామని, పోటీ ఉన్నందున జెమిని ఏఐని ప్రారంభించామని వివరించారు.
అమెరికా వెలుపల తాము చేపట్టిన అతిపెద్ద ఏఐ ఇన్వెస్ట్ మెంట్ !
October 18, 2025
0
Tags