తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం పైన సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. బీసీ రిజర్వేషన్ల పై హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి రిజర్వేషన్ల ఖరారు ఏ విధంగా చేసిందీ వివరించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన అంశంతో పాటుగా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశాన్ని కోర్టుకు నివేదించారు. వాదనల తరువాత సుప్రీంకోర్టు పిటీషన్ ను కొట్టివేస్తూ 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్దేశించింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం పైన సుప్రీంకోర్టు లో వాదనలు జరిగాయి. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో రిజర్వేషన్ల అమలు, స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం, పీసీసీ నేతలు పలుమార్లు ప్రకటించారు. దీంతో, ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం తెలంగాణ కేబినెట్ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఈ నెల 9న స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెష ల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ కోర్టుకు వివరించారు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లపై 50 శాత పరిమితి లేదని, గతంలో సుప్రీంకోర్టు కేవలం ఒక మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పేర్కొన్నారు. అయినా, హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో రిజర్వేన్లకు అనుకూలంగా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశాన్ని సింఘ్వీ కోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి రిజర్వేషన్ల పైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాగా, నిర్ణయం గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న అంశాన్ని సుప్రీం ప్రస్తావించింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే గత తీర్పులను ప్రతివాది లాయర్లు కోర్టుకు వివరించారు. దీంతో, వాదనల తరువాత సుప్రీంకోర్టు పిటీషన్ ను కొట్టివేస్తూ 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్దేశించింది.
బీసీ రిజర్వేషన్లపై దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు !
October 16, 2025
0
Tags