నవంబర్ 15 నాటికి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Telugu Lo Computer
0


తెలంగాణలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నవంబర్ 15 నాటికి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీకి సిద్దం చేయాలని వ్యవసాయ, చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జౌళీ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గతంలో (బీఆర్ఎస్ హయాంలో చీలర పంపిణీ) నాణ్యత విషయంలో విమర్శలు నేపథ్యంలో, చేనేత కార్మికులతో ప్రత్యేకంగా నాణ్యతతో కూడిన చీరలను ఉత్పత్తి చేయిస్తున్నట్టుగా తెలిపారు. మహిళల కోసం 6.5 మీటర్ల చీరలు, వృద్ధుల కోసం తొమ్మిది మీటర్ల చీరలు రూపొందించామన్నారు. చీరల తయారీలో దాదాపు 6,500 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఉపాధి లభించిందని తెలిపారు. అలాగే చేనేత రంగానికి ప్రోత్సహం లభించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 64.69 లక్షల చీరలను సిద్దం చేయాలని చెప్పారు. ఇప్పటికే 33.35 లక్షల చీరలను ఉత్పత్తి చేసి జిల్లా గోదాములకు పంపించామని... వచ్చే నెల 15 నాటికి మిగిలినవి కూడా పూర్తి చేసి గోదాములకు తరలించి పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సందర్భంగా రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తి చేసి వారి ఖాతాల్లో నిధులను జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నేతన్న భరోసా పథకం కింద ఈ ఏడాది రూ. 48.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పథకంలో చేనేత కార్మికులకు రూ. 18 వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేలు చొప్పున ఏడాదికి రెండు విడతల్లో ప్రోత్సాహకం అందిస్తామని తుమ్మల వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు చేసే వస్త్రాలు కొనుగోళ్లకు సంబంధించి ఆర్డర్లు టెస్కో నుంచే తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీని యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి తరలించే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)