10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా : రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సెమీస్ బెర్త్‌ ఖరారు

Telugu Lo Computer
0


వైజాగ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వరుస విజయాలతో ఓటమెరుగని ఆస్ట్రేలియా జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే నాకౌట్ బెర్త్ దక్కించుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఇది ఆసీస్‌కు నాలుగో విజయం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. సోభాన మోస్ట్రే(66 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్, అలనా కింగ్, జార్జియో వేర్‌హామ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మేఘన స్కట్ (1/11) ఒక వికెట్‌ తీసింది. అనంతరం ఆస్ట్రేలియా 24.5 ఓవర్లలో 202 పరుగులు చేసి 151 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ నాలుగు గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో 9 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తమ తదుపరి మ్యాచ్‌లను ఇంగ్లండ్, సౌతాఫ్రికాతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఆసీస్.. సెమీస్‌ బెర్త్‌కు డోకా లేదు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఇంగ్లండ్, సౌతాఫ్రికా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతుండగా.. భారత్ రెండు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ రెండు గెలిచినా సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. రెండు ఓడితే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)