సమ్మక్క - సారలమ్మ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారంలో సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకుని, అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని కోరారు. అయోధ్య, కుంభమేళాకే కాదు మేడారానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. వాతావరణం సహకరించదని అధికారులు చెప్పినా తాను పట్టించుకోలేదని, అంతా సమ్మక్క-సారలమ్మ చూసుకుంటారని ఏర్పాట్లు చేయమని ఆదేశించానని పేర్కొన్నారు. మేడారం గద్దెల పునర్నిర్మాణం తమకు జన్మలో దక్కిన గొప్ప అదృష్టమని చెప్పుకొచ్చారు. సమ్మక్క - సారలమ్మ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీల సంప్రదాయాలను పరిరక్షిస్తామని ఉద్ఘాటించారు. ఆదివాసీల వారసులు, రీసెర్చ్ చేస్తున్న స్కాలర్స్‌ను మేడారం ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు చేశామని సీఎం తెలిపారు. రాళ్లతో నిర్మించినా రామప్పలా వందల ఏళ్లు పటిష్టంగా ఉండేలా మేడారం గద్దెలను రాతికట్టడాలతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మహా జాతర వరకు రేయంబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జంపన్నవాగు, రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే వందరోజుల్లో భక్తితో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈసారి జాతరను అద్భుతంగా చేద్దామని పిలుపునిచ్చారు. మేడారం పునర్నిర్మాణం బాధ్యతతో పాటు భావోద్వేగంతో కూడుకున్నదని వివరించారు. తమ ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాంతమైన మేడారం నుంచి తాను పాదయాత్ర ప్రారంభించానని గుర్తు చేశారు. ఫిబ్రవరి 6, 2023న సమ్మక్క, సారక్క అమ్మవార్ల దగ్గర నుంచి పాదయాత్ర చేసి విజయం సాధించామని ఉద్ఘాటించారు. ఆదివాసీలు అంటే ఈ దేశ మూలవాసులని చెప్పుకొచ్చారు. అందుకే వారి అభివృద్ధిపై దృష్టి పెట్టామని వెల్లడించారు. అభివృద్ధి పథకాల్లో ఆదివాసీలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)