విశాఖపట్నంలో యాక్సెంచర్ కొత్త క్యాంపస్ ఏర్పాటు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో యాక్సెంచర్ సంస్థ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ క్యాంపస్ ఏర్పాటు ద్వారా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వెల్లడించింది. విశాఖపట్నం వేదికగా యాక్సెంచర్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయని, అనుమతులు లభించడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వాటికి 99 పైసలకే ఎకరం చొప్పున భూములు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే యాక్సెంచర్ సంస్థ కూడా విశాఖలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. క్యాంపస్ ఏర్పాటు కోసం విశాఖలో పది ఎకరాలు భూమి కావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. యాక్సెంచర్ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై యాక్సెంచర్ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు విశాఖకు టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థల రాకతో 20 వేల ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. కాగ్నిజెంట్ 183 మిలియన్ డాలర్లు, టీసీఎస్ 154 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అటు తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ తర్లువాడలో ఏర్పాటు చేయనుంది. ఆ రకంగా విశాఖపట్నానికి ఐటీ సంస్థలు తరలి వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇక గూగుల్ డేటా సెంటర్ కోసం సింగపూర్ నుంచి సముద్రంలో కేబుల్స్ తీసుకురావాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. మొత్తానికి ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)