జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'లో చిరంజీవి తనకు ఆదర్శమని కొరియోగ్రాఫర్ ప్రభుదేవా అన్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు ఈ కార్యక్రమంలో సందడి చేయగా తాజా ఎపిసోడ్‌కు ప్రభుదేవా అతిథిగా హాజరయ్యారు. తన బాల్యం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ''నాకు హిప్‌అప్, బ్రేక్ డ్యాన్స్.. ఇలా రకరకాల డ్యాన్స్‌లు తెలియవు. నాకు తెలిసింది నా డ్యాన్స్ మాత్రమే. నాకు వచ్చిన దాన్ని ప్రేక్షకులకు అందిస్తాను. మా వంశంలో చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు. మా అబ్బాయి రిషికి రెండేళ్ల ముందువరకూ ఈ రంగంపై ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం సడన్‌గా 'నేను యాక్టర్ అవుతాను' అన్నాడు. ఆ మాటకు నేను ఆశ్చర్యపోయాను. ఇండస్ట్రీ చాలా గొప్పది. కానీ, ఇందులో నిలబడాలంటే చాలా కష్టం. అప్పటివరకూ చిన్న పిల్లాడిలా ఉన్న మా అబ్బాయి నేను యాక్టర్ అవుతాను అని చెప్పినప్పుడు నిజంగా షాకయ్యాను. చదువు పూర్తిచేయమని చెప్పా. ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తే ఇండస్ట్రీ వాతావరణం అలవాటు అవుతుందని షూటింగ్‌కు పంపాను. నాకు ఇండస్ట్రీలో చిరంజీవి ఆదర్శం. ఆయన చాలా కష్టపడతారు. 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' సినిమాలో మెరుపులా.. సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించాను. అప్పుడు ఆయన డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆయన వీడియోలు చూసి వామ్మో అనుకున్నాను. నాకు ఈరోజు ఇంత గుర్తింపు వచ్చిందంటే చిరంజీవే కారణం. టాలెంట్ ఉంటే ఆయన కచ్చితంగా ప్రోత్సహిస్తారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలో 'అబ్బనీ తీయనిదెబ్బ..' కొరియోగ్రఫీలో మా నాన్నతో పాటు నేనూ భాగమే. అప్పుడు నా వయసు 15 ఏళ్లు. ఏమీ తెలియదు. స్టెప్స్ నేర్పించడం, నా పని నేను చేసుకోవడం అంతే'' అని ప్రభుదేవా అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
చిరంజీవి నాకు ఆదర్శం : టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'లో ప్రభుదేవా
September 29, 2025
0
Tags