'వైకాపా సైతాన్ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా నా కొడుకే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు. ఎంత మంది మొత్తుకున్నా దీన్ని మార్చలేరు' అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. 'నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. అప్పుడే వైకాపా ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా? బెదురా అనేది వాళ్లకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుకుకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా నామకరణం చేశారు. చంద్రబాబు చెప్తే నా కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కష్టపడి ఒక వీడియోను మార్ఫింగ్ చేశారు. అది చూసి నవ్వొచ్చింది. ఇంత కష్టం ఎందుకని? చంద్రబాబు చెప్తే నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తే, మరి ఎవరు చెపితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలి' అని షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో గురువారం నిర్వహించిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న షర్మిల అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'వైఎస్‌ఆర్ తన మొత్తం జీవితకాలం భాజపాను వ్యతిరేకించారు. ఆయన బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునేవారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఎందుకు మద్దతివ్వలేదో జగన్ సమాధానం చెప్పాలి? మోదీకి జగన్ దత్తపుత్రుడు. ఆయన చెప్పినట్లు ఆడుతున్నారు. వైఎస్‌ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన జగన్ అదే రిలయన్స్‌కు చెందిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. మోడీ కోసం అదానీకి గంగవరం పోర్టు కట్టబెట్టారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ భాజపా బిల్లులకు మద్దతిచ్చారు. ఆ పార్టీకి తొత్తుగా, తోక పార్టీగా వైకాపా పని చేస్తోంది' అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శించారు. 'దమ్ముంటే.. వైకాపా భాజపాకు తోక పార్టీ అని జగన్ అంగీకరించాలి. ఆ ధైర్యం లేకుంటే చేతి మీద భాజపా అని పచ్చబొట్టు వేసుకోండి. పొరుగు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఎవరికీ ఓటు వేయకుండా మౌనంగా ఉంది. వైకాపాకు ఆ మాత్రం ఇంగితం లేదు. వైఎస్‌ఆర్ వారసుడై ఉండీ భాజపాకు ఓటు వేయడం సిగ్గు చేటు. వైఎస్‌ఆర్ ఛాతిలో కత్తితో పొడిచిన వాడిలా చరిత్రలో మిగిలిపోతారు' అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రైతులకు భరోసా లేదు. ఏ పంటకూ మద్దతు ధర అందడం లేదు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే ఆ పథకాలు ప్రజలకు ఎందుకు అందడం లేదు' అని ప్రభుత్వాన్ని షర్మిల నిలదీశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు మా అబ్బాయే : ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
September 12, 2025
0
Tags