పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని భావించే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. కానీ, పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి తీసుకురాకూడదని తెలిపారు. అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శితో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో పవన్ సమావేశమయ్యారు. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలపై మరోసారి సమీక్షించారు. గత ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంస్థలలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. విశాఖ ప్రాంతంలో ఫార్మా సంస్థలు ఉన్నాయని, వాటిలో కాలుష్య నియంత్రణ నిబంధనల అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనల అమలులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన తొలి రోజుల్లోనే పీసీబీపై సమీక్షించి దిశా నిర్దేశం చేశామని వ్యాఖ్యానించారు. భావితరాలకు సాధ్యమైనంత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది విధులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని భావించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి !
September 22, 2025
0
Tags