వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు సులభతరం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూమలు రిజిస్ట్రేషన్ ఫీజులను సులభతరం చేసింది. దశాబ్దాల కాలంగా తమ వద్దే ఉన్న భూములకు మరోసారి రిజిస్ట్రేషన్ ఫీజులను ఎందుకు కట్టాలనే ప్రశ్న వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం భూముల విలువ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలుకు నిర్ణయించింది. భారీ స్థాయిలో తగ్గింపుకు సిద్దమైంది. సచివాలయాల్లోనే వీటిని రిజిస్టర్ చేసేలా కొత్త కార్యచరణ అమలుకు నిర్ణయించింది. భూమి కలిగిన పట్టాదారుల్లో అనేక మంది జీవించి లేనట్లుగా రెవిన్యూ శాఖ గుర్తించింది. అయినా, వారి పేర్లతోనే ఇప్పటికీ పట్టాలు కొనసాగుతున్నాయి. ఇది రైతులకు సమస్యగా మారింది. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 85,41,002 మంది పట్టాదారులు ఉన్నారు. వారిలో 3,91,405 మంది ఇప్పటికే మరణించారు. ఈ భూములు వారసుల అనుభవంలోనే ఉన్నప్పటికీ వారి పేర్లతో బదిలీ కాలేదు. కుటుంబ పెద్ద చనిపోయి ఏళ్లయినా వారసులు ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ భూముల ను రిజిస్టర్ చేయించుకోవాలంటే.. ఒక శాతం మేర స్టాంపు రుసుము చెల్లించాల్సి ఉంది. కాగా, కొందరికి రుసుము భరించే స్థోమత లేకపోవడం, కుటుంబసభ్యుల మధ్య వాటాల సమస్యలు తేలకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగలేదు. ఇదే కారణంగా పంట రుణాలకు, సంక్షేమ పథకాలకూ రైతులు దూరమవుతున్నారు. దీంతో.. సీఎం చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.10 లక్షల లోపు విలువైన ఆస్తులకు రూ.100, రూ.10 లక్షల పైబడితే రూ.1,000 మాత్రమే స్టాంపు రుసుము కట్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలని ఆలోచిస్తోంది. అయితే సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసినా మళ్లీ సబ్‌రిజిస్ట్రార్‌ ఆమోదం తప్పనిసరి అవుతుంది. దీంతో దీని పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రతిపాదన అమలైతే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సాధ్యమవుతుంది. రైతులు సులభంగా పంట రుణాలు పొందగలరు. సంక్షేమ పథకాలకు అర్హత సాధించే అవకాశ కలుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)