చాంది ఇంజినీరింగ్‌ కాలేజీలో హాస్టల్ బిల్డింగ్‌ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య !

Telugu Lo Computer
0


బీహార్‌ రాజధాని పాట్నా సమీపంలోని చాంది ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థిని హాస్టల్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులు కాలేజీ క్యాంపస్‌లో ఆందోళనకు దిగి, పోలీస్‌ వాహనాలకు నిప్పుపెట్టారు. ముంగేర్ జిల్లాలోని బరియార్‌పూర్ బ్లాక్‌కు చెందిన 20 ఏళ్ల సోనమ్ కుమారి సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. బుధవారం రాత్రి హాస్టల్‌ బిల్డింగ్‌ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థులు అర్ధరాత్రి వేళ క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్ నందన్, స్టూడెంట్లను వేధించడంతోపాటు బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. సోనమ్ కుమారి రక్తం మడుగుల్లో అరగంట పడి ఉన్నప్పటికీ కాలేజీ వాహనంలో ఆమెను హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రిన్సిపాల్‌ నిరాకరించినట్లు విమర్శించారు. ఆ తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇది చూసి మృతురాలి స్నేహితురాలు శిఖా కుమారి మానసికంగా కుంగిపోయింది. దీంతో చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు. మరోవైపు అర్ధరాత్రి వేళ స్టూడెంట్స్‌ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. డీఎస్పీ వాహనంతోపాటు ఒక స్కూటర్‌కు నిప్పుపెట్టారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే అక్కడకు రప్పించాలని డిమాండ్‌ చేశారు. స్టూడెంట్స్‌ అశాంతి పెరగడంతో ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలతోపాటు 20 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్‌ దళాలను ఆ కాలేజీ క్యాంపస్‌లో మోహరించారు. చివరకు గురువారం తెల్లవారుజామున పరిస్థితి అదుపులోకి వచ్చింది. విద్యార్థిని సోనమ్‌ కుమారి మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల స్టేట్‌మెంట్లు రికార్డ్‌ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)