ఉక్రెయిన్ డ్రోన్లు నిరంతరం ఇంధన సరఫరా వ్యవస్థలపై దాడులు చేయడంతో రష్యాలో చమురుకు కొరత ఏర్పడింది. దీంతో అన్నిరకాల చమురు ఎగుమతులను నిలిపివేయాలని క్రెమ్లిన్ ఆదేశించింది. నిషేధం ఈ సంవత్సరం చివరి వరకు అమల్లో ఉండనుంది. ఎండాకాలం మొత్తం రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాలు, ఇంధన సరఫరా రైళ్లను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. సాధారణంగా ఆ సీజన్‌లోనే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇంధన డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఆ దేశంలో కొరతను సృష్టించడమే లక్ష్యంగా దాడులు ప్లాన్ చేసింది. మరోవైపు రష్యా అధికారులు మాత్రం ఈ నిషేధానికి రవాణా వ్యవస్థల్లో కొరతను కారణంగా చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ మునుపటిలా సరఫరా చేస్తామని చెప్పారు. ఇంకోవైపు ఉక్రెయిన్ మాత్రం తాము రష్యాలోని పలు ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు చెబుతోంది. దక్షిణ రష్యాలో గ్యాజ్‌ప్రోమ్ నిర్వహిస్తున్న ఓ భారీ చమురు శుద్ధి కేంద్రాన్ని ఇటీవలే ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు రష్యా నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్‌లో మార్చిలో కొంత బ్యాన్ విధించింది. దానిని మళ్లీ జులైలో విస్తరించింది. తాజాగా గురువారం ఆ దేశ డిప్యుటీ పీఎం అలెగ్జాండర్ నొవాక్ ఈ నిషేధాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇక డీజిల్‌లో కొంతమేరకు ఎగుమతిని కూడా ఆపినట్లు పేర్కొన్నారు. ఇక దేశంలోని చాలా ప్రాంతాల్లో వినియోగదారులకు డీజిల్, పెట్రోల్ నిర్దేశించినంతే ఇస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక క్రిమియాలో సగం పెట్రోల్ పంపులు నిల్వలు లేక మూతపడినట్లు వెల్లడించింది. చాలా చోట్ల వాహనాలు ఇంధనం కోసం బారులుతీరి ఉన్నాయి.
ఉక్రెయిన్ దాడులతో ఇంధన ఎగుమతులపై రష్యా నిషేధం !
September 26, 2025
0
Tags