నేపాల్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తితో నేపాల్‌లో యువత చేపట్టిన ఆందోళనలు ఫలించాయి. 'జెన్ జీ' తరం ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక నిరసనల ధాటికి పాత ప్రభుత్వం కుప్పకూలగా, దేశంలో కొత్త రాజకీయ శకం మొదలైంది. దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కే (73) తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. దేశాన్ని తిరిగి గాడిన పెట్టడం, యువత ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఈ తాత్కాలిక ప్రభుత్వం పనిచేయనుంది. ప్రధాని సుశీల కర్కే తన మంత్రివర్గంలో ముగ్గురు కీలక వ్యక్తులకు స్థానం కల్పించారు. సమాజంలో మంచి పేరున్న, తమ రంగాల్లో నిపుణులైన వారిని ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఓమ్ ప్రకాశ్ అర్యాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ఈయనకు హోం, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల వంటి కీలక శాఖలను అప్పగించారు. కుల్మన్ ఘిసింగ్ నేపాల్ విద్యుత్ అథారిటీ మాజీ అధిపతిగా, దేశంలో ఏళ్ల తరబడి ఉన్న విద్యుత్ కోతలకు చరమగీతం పాడిన వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు ఆయనకు ఇంధనం, మౌలిక సదుపాయాలు, రవాణా, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు ఇచ్చారు. ఈ నియామకంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. రమేశ్వర్ ఖానల్ ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన ఈయనకు ఆర్థిక శాఖను కేటాయించారు. దేశంలో 25 శాతం మేర ఉన్న యువ నిరుద్యోగితను పరిష్కరించే గురుతర బాధ్యతను ఆయనపై ఉంచారు. తాజాగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని సుశీల కర్కే మాట్లాడుతూ, తాను ఈ పదవిని కోరుకోలేదని, ప్రజల ఆకాంక్షల మేరకే బాధ్యతలు స్వీకరించానని స్పష్టం చేశారు. "నా పేరు సమాజం నుంచి తెరపైకి వచ్చింది. ఈ ప్రభుత్వం 'జన్ జీ' తరం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది" అని ఆమె హామీ ఇచ్చారు.
'జెన్ జీ' తరం ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది !
September 15, 2025
0
Tags