ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి 15వేల రూపాయలు చొప్పున ఈ రివాల్వింగ్ ఫండ్ !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ, గ్యాస్ సిలిండర్లపైన రాయితీని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మహిళా సాధికారత కోసం మరో అడుగు ముందుకు వేసింది. డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. డ్వాక్రా మహిళలను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 4079 స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద 6.11 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి 15000 రూపాయలు చొప్పున ఈ రివాల్వింగ్ ఫండ్ గ్రాండ్ ను ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఆర్థిక స్వావలంబన పెంపొందించడానికి, వారిని స్వయం ఉపాధి పైపు నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసింది. ఈ పథకం ద్వారా చిన్నచిన్న సంఘాలుగా ఏర్పడిన డ్వాక్రా మహిళలు దేశవ్యాప్తంగా ఆర్థిక పురోగతిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో డ్వాక్రా మహిళలను మరింత ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాలు డ్వాక్రా గ్రూపులకు బలమైన మద్దతును అందిస్తున్నాయి. తాజాగా 32 జిల్లాలకు చెందిన 4079 స్వయం సహాయక మహిళా గ్రూపులకు రివాల్వింగ్ ఫండ్ కింద 6 కోట్ల 11 లక్షల 85 వేల రూపాయలను విడుదల చేస్తూ సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ గ్రాంట్ ద్వారా ఒక్క మహిళా సంఘానికి 15 వేల రూపాయల చొప్పున ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తం వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ నిధులు విడుదల కావడంతో దసరా పండుగకు ముందు మహిళలలో సంతోషం వ్యక్తమవుతోంది. దసరాకు తమకు కానుకగా ఈ నిధులను ఇస్తున్నారని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)