ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన గడ్డం వేణుగోపాల్, కర్నాటకకు చెందిన శ్రేయాస్ పాల్ కలిసి సైబరాబాద్ కేంద్రంగా నకిలీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఐఐటీ క్యాపిటల్ టెక్నాలజీస్, ఏవీ సొల్యూషన్స్, శ్రీనివాస్ అనలిటిక్స్, ట్రేడ్ బుల్స్ టెక్నాలజీస్ వంటి రకరకాల పేర్లతో ఆన్‌లైన్‌లో నకిలీ కంపెనీలను నిర్వహిస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నకిలీ సెబీ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ రిజిస్ట్రేషన్లను సృష్టించారు. మధ్యతరగతి ఇన్వెస్టర్లను, ఐటీ నిపుణులు, రిటైర్డు ఉద్యోగులను నమ్మించేందుకు ప్రీమియం ఆఫీసులు, హోటళ్లలో సెమినార్లు నిర్వహించేవారు. పెట్టుబడులపై ఏటా 84 శాతం రాబడిని అందిస్తామని మాయమాటలు చెప్పి, స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్, కల్పిత ట్రేడింగ్ డాష్‌బోర్డ్‌ల ముసుగులో 2022 నుంచి 2025 మధ్య కాలంలో సుమారు మూడు వేల మందికి పైగా బాధితుల నుంచి రూ. వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులను వసూలు చేశారు. ఇన్వెస్టర్ల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును 21 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. ఆయా సొమ్ముతో ప్రాపర్టీలు, లగ్జరీ వాహనాలు, బంగారం కొనుగోలు చేశారు. ఈ మేరకు పలువురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులు గడ్డం వేణుగోపాల్, శ్రేయాస్ పాల్‌లను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 20 మందికి పైగా ఏజెంట్లు, కన్సల్టెంట్లు, టెక్నికల్ డెవలపర్లు, వెబ్‌సైట్ నిర్వాహకులు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సైబరాబాద్ కేంద్రంగా నకిలీ కంపెనీల ఏర్పాటు : రూ.1000 కోట్ల మోసం : ఇద్దరు నిందితుల అరెస్టు
September 12, 2025
0
Tags