ఆంధ్రప్రదేశ్ లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 25వ తేదీ నుంచి 31 వరకు అర్హులైన లబ్ధిదారులకు జారీ అయిన ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుందని సమాచారం. వీటితో కలిపితే రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్దిదారుల సంఖ్య 4,29,79,897కి చేరిందని అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటో, కుటుంబసభ్యుల పేర్లు, QR కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. దీని ద్వారా లబ్ధిదారుల గుర్తింపు మరింత తేలిక అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్త స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు పొందుతారని అధికారులు తెలిపారు. రేషన్ కార్డులో కుటుంబ పెద్ద పేరు, క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు.
రేషన్ కార్డు వివరాలు చెక్ చేసుకునే విధానం
- ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ https://aepos.ap.gov.in/SRC_Trans_Int.jsp లింక్ను ఓపెన్ చేయాలి
- అందులో మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయండి
- ఆ తరువాత Submit బటన్ పై క్లిక్ చేయండి
- మీ కొత్త రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీరు ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు