ఆంధ్రప్రదేశ్ లో కన్నతల్లిపై కొడుకు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో జక్కు లక్ష్మీనరసమ్మ (50) రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీ (32)కి వివాహం కాగా, అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చియ్యపాలెంలో తాపీమే్రస్తిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంటిలోనే నివాసముంటోంది. ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. లక్ష్మీనరసమ్మకు ఈ దాడిలో తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అంబులెన్సులో లక్ష్మీనరసమ్మను కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతల్లి పై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడిన కొడుకు !
August 11, 2025
0
Tags