యాక్సిడెంట్ కేసులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్షను విధించిన కోర్టు

Telugu Lo Computer
0


టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అలానే రూ.12,500లు జరిమానా కూడా విధించింది. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఈ తీర్పు వెల్లడయ్యింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న లోబో రఘునాథపల్లి మండలం వద్ద ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, కొందరికి గాయాలయ్యాయి. నాడు నమోదైన కేసులో తాజాగా లోబోకు కోర్టు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించడమే కాక మరికొందరు గాయపడటానికి కారణమైన లోబోకు జనగామ కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జనగామా జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు తెలిపిన వివరాల ప్రకారం 2018, మే 21న లోబో ఓ టీవీ ఛానల్‌ కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను తన టీమ్‌తో కలిసి వరంగల్ జిల్లాలోని లక్నవరం, భద్రకాళి చెరువు, రామప్ప, వేయి స్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించాడు. ఆ తర్వాత వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో లోబోనే స్వయంగా కారు నడిపాడు. ఈ క్రమంలో లోబో కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్‌కు వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద యాక్సిడెంట్ జరిగంది. లోబో తన కారుకు ఎదురుగా వచ్చిన ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. అలానే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరి కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో లోబో, అతడి టీమ్ ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది. దీంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు పోలీసులు వివరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)