తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఇబ్బందులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయించామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, తితిదే మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకాలంటూ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు. ఈ మేరకు బీఆర్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.''శ్రీవారి దర్శన విషయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా గూగుల్/టీసీఎస్‌లతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఆధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించాం. రెండు గంటలలోపు భక్తులకు దర్శనం కల్పించాలని తితిదే పాలక మండలి ముందుకు వెళ్తున్న సమయంలో తితిదే ఈవోగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న జాప్యాన్ని, ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో ఏఐ ద్వారా సాధ్యమైనంత త్వరగా దర్శనం పూర్తిచేసేందుకు ప్రముఖ సంస్థలు పని చేస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. భక్తుల్లో గందరగోళం సృష్టించేలా తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. తితిదే దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అనడం ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతకే వదిలేస్తున్నా. భక్తులను గంటలు, రోజుల తరబడి షెడ్లు, కంపార్ట్‌మెంట్లలో బంధించి పడిగాపులు కాసేలా చేయడం మంచిదా? వారి ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ సాంకేతికత తీసుకురావాలని నిర్ణయించాం. ప్రపంచం మొత్తం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్న తరుణంలో తితిదే కూడా వాడటంలో ఎలాంటి తప్పులేదు.'' అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు !
August 03, 2025
0
Tags