హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జెల్లెల శేఖర్ (40), చిట్టి (33) దంపతులు నివాసం ఉంటున్నారు. శేఖర్ వృత్తిరీత్యా డ్రైవర్. అయితే డ్రైవింగ్ వృత్తిపై శేఖర్ అప్పుడప్పుడు రెండు, మూడు రోజులు లేదంటే వారం రోజులపాటు బయట ప్రాంతాలకు వెళ్లేవాడు. అదే సమయంలో చిట్టికి హరీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో చిట్టి, హరీష్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన భర్త శేఖర్ కు భార్య చిట్టి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్నాడు. భార్య చేస్తున్న పని తప్పని పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా చిట్టి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవ జరిగేది. తమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను ఎలాగైనా సరే అంతం చేయాలని భార్య చిట్టి పథకం వేసింది. పథకం ప్రకారమే రాత్రి సమయంలో తన ప్రియుడు హరీష్ ని పిలిచింది. గాఢ నిద్రలో ఉన్న భర్త శేఖర్ గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఉదయం ఏమీ తెలియనట్లుగా తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ నానా హంగామా సృష్టిస్తూ డయల్ 100 కి ఫోన్ చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో పోస్టు మార్టం నివేదికలో హత్య అని తేలడంతో పోలీసులు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. అనంతరం పోలీసులు మృతుడు శేఖర్ భార్య చిట్టి ప్రవర్తన పై అనుమానం కలిగి ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా... తానే తన ప్రియుడి తో కలిసి తన భర్తను హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో పోలీసులు వెంటనే చిట్టిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య
August 30, 2025
0