ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం విషయంలో పలుమార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వారు ఇవాళ అల్టిమేటం ఇచ్చారు. పరిస్దితిలో మార్పు రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరు సంవత్సరాలనుండి ఒకే క్యాడర్ లో పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అపరిష్కృత సమస్యలపై సచివాలయాల శాఖ అధికారులకు, ప్రభుత్వానికి తాజాగా మరోసారి వినతిపత్రం ఇవ్వాలని వారు నిర్ణయించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సర్వీస్ రెగ్యులరైజేషన్ ను డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి తీసుకొని నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు అప్ గ్రేడ్ చేయాలని, రెండు సంవత్సరాల కాలపరిమితి ముగియగానే చేయవల్సిన ప్రోబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందుకు చెల్లించవలసిన ఎరియర్స్ చెల్లించాలని, అన్ని జిల్లాల్లో అన్ని విభాగాల సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు మెరిట్ కం రోస్టర్ విధానంలో ప్రదర్శించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తదుపరి పదోన్నతి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ లేదా అంతకంటే ఎక్కువ ఉండే విధంగా పదోన్నతి ఛానల్ రూపొందించాలని, సచివాలయ ఉద్యోగులను అవకాశం ఉన్న మేరకు అర్హత ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని కోరుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు బదిలీలపై ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల విధానాన్ని అనుసరించి ప్రత్యేక విధానం కల్పించాలని, అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు సబ్సిడీతో ఇళ్ళ స్థలాలు కేటాయించాలని,ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నట్లు నాయకులు ప్రకటించారు.
ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
August 04, 2025
0