అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల ఆంక్షలు ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉన్నాయి. ఇటీవల విధించిన భారీ దిగుమతి సుంకాలతో అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. యేల్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ట్రంఫ్ టారిఫ్ సుంకాల ప్రభావం అమెరికాలో మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేయనున్నాయి. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ప్రతి అమెరికన్ కుటుంబానికి సగటున 2,400 డాలర్లు వరకూ నష్టం వాటిల్లనుందని నివేదిక తేల్చి చెప్పింది. అమెరికా తన దిగుమతులపై సగటున 20 శాతం సుంకం విధించింది, ఇది అమెరికా మార్కెట్లో వస్తువులను ఖరీదైనదిగా చేయడమే కాకుండా భారతదేశం వంటి దేశాల వాణిజ్యం, ఎగుమతిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం రోజువారీ వినియోగ వస్తువుల ధరల పెరుగుదలపై పడనుంది. బూట్లు, దుస్తులు, హ్యాండ్‌బ్యాగులు, కారు వంటి వస్తువులపై సుంకాలు భారీగా పెరగడంతో..వాటి ధరలు అమెరికాలో 20 శాతం నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఆహార ధరలూ సగటున 3.4 శాతం పెరగనుండగా, కూరగాయల ధరలు 7 శాతం వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ముఖ్యంగా అమెరికాలో మిడిల్ క్లాస్ ప్రజల జీవనం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోనుందని నివేదిక తెలిపింది. ఎస్బీఐ నివేదిక ప్రకారం అమెరికా ప్రతి సంవత్సరం ఇతర దేశాల నుండి దాదాపు 3.26 ట్రిలియన్ డాలర్ల (రూ. 272 లక్షల కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఈ మొత్తం దిగుమతిపై 20 శాతం పన్ను విధించినప్పుడు వస్తువుల ధర మొదటి స్థాయిలోనే పెరుగుతుంది. ఇది క్రమంగా వినియోగదారునికి చేరుతుంది. ఈ పన్ను కారణంగా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం వెంటనే 2.4 శాతం పెరగవచ్చని, 1.2 శాతం పెరుగుదల దీర్ఘకాలికంగా కూడా కొనసాగవచ్చని నివేదిక పేర్కొంది. ఈ పన్ను కారణంగానే ప్రతి అమెరికన్ కుటుంబం సంవత్సరానికి సగటున $2,400 నష్టపోతుందని ఎస్బీఐ అంచనా వేసింది. పేద కుటుంబాలు ఆదాయం ఎక్కువ భాగం ద్రవ్యోల్బణం వల్ల కోల్పోతుంది. మరోవైపు ధనిక కుటుంబాలు కూడా (సుమారు $5,000) కోల్పోయినప్పటికీ, వారి జీవన ప్రమాణాలపై దాని ప్రభావం అంత తీవ్రంగా ఉండకపోవచ్చని నివేదిక తెలిపింది. జేపీ మోర్గన్ నివేదిక ప్రకారం ట్రంప్ విధించిన సుంకాల వల్ల 2025 నాటికి అమెరికన్ వృద్ధి రేటు 0.5 శాతం పాయింట్లు తగ్గిపోవచ్చని అంచనా. దీంతో పాటుగా సుమారు 5 లక్షల ఉద్యోగాలు కోల్పోవచ్చని తెలిపింది. ఈ విధానాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతూనే..వినియోగదారుల డిమాండ్‌ను తగ్గించడానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను మాంద్యం దిశగా నడిపిస్తోందని తెలిపింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికాలో ధనిక వర్గాలు డాలర్ల పరంగా ఎక్కువ నష్టాలను చవిచూసినా తక్కువ ఆదాయ కుటుంబాలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది వారి ఆదాయంలో వాటాగా కొలిచినప్పుడు ఇది మూడు రెట్లు అధికంగా ఉండవచ్చని యేల్ నివేదిక స్పష్టం చేసింది. ఒకసారి ధరలు పెరిగిన తర్వాత, వేతనాలు పెరగకపోతే వాస్తవ ఆదాయం క్షీణిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే సంకేతాలు
August 01, 2025
0
Tags