శ్రీముఖ్ నమిత 360 లైఫ్ ప్రాజెక్ట్ పేరుతో కస్టమర్లందరినీ నట్టేట ముంచిన బిల్డర్లు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ శేరిలింగంపల్లి పరిధిలోని ఇజ్జత్‌నగర్, హైటెక్ సిటీకి అతి చేరువలో 25 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్. రంగురంగుల బ్రోచర్లు చూపించి, ప్రీలాంచ్ ఆఫర్ల మేజిక్‌తో శ్రీముఖ్ నమిత 360 లైఫ్ ప్రాజెక్ట్ పేరుతో ఆరేళ్లకిందటే ఫ్లాట్లన్నీ అమ్ముకున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి పర్మిషన్లు లేవని, నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, అక్రమనిర్మాణానికి వంత పాడుతున్న జీహెచ్ఎంసి అధికారులపై సీరియస్ అయింది. ఎర్రం విజయ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, నమితా హోమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించింది. కానీ, ఉల్లంఘనలు సరిచేయకుండానే నమిత హోమ్స్‌కి రెండేళ్ల పాటు నిర్మాణ అనుమతుల్ని జీహెచ్ఎంసి పునరుద్ధరించింది. నిబంధనలు పాటించకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేది లేదంటూ జీహెచ్ఎంసి సమర్థించుకుంది. కానీ, అక్రమ నిర్మాణాన్ని కొనసాగించడానికి ఎలా అనుమతిస్తారు? ఉల్లంఘనలున్నాయని తెలిసినప్పుడే నిర్మాణాన్ని నిలిపెయ్యాలి కదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ వరకు నిర్మాణపనులు జరక్కూడదని, ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసిని హెచ్చరించింది తెలంగాణ హైకోర్టు. ఇటు కోట్లు కుమ్మరించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు, ఆరేళ్లు దాటినా హ్యాండోవర్ చెయ్యకపోవడంతో లబోదిబోమంటున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)