జల దిగ్బంధంలో రామాయంపేట పట్టణం : వరద పోటెత్తడంతో 10 వేల కోళ్లు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని మెదక్ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో బుధవారం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఓ తండా నీట మునిగింది. పెద్దశంకరంపేటలో 20.4 సెంటీమీటర్లు, టేక్మాల్ మండలం బోడగట్టులో 20.1, రామాయంపేటలో 17.9, నార్సింగి మండలంలో 16.5, హవేలీ ఘనపూర్ మండలం సర్ధనలో 16.1, పాపన్నపేట మండలం లింగాయిపల్లిలో 15.5 సెం.మీ మేర వర్షం పడింది. హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా నీట మునిగింది. హవేలిఘనపూర్‌లో పెద్ద చెరువు కట్ట తెగింది. మెదక్‌లో పసుపులేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో 40 సెం.మీల వర్షం పడటంతో ఆ ప్రభావం మెదక్‌ జిల్లాపై పడింది. వర్షాల కారణంగా రామాయంపేట పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలు నీట మునిగాయి. మెదక్ పట్టణంలోని సాయి నగర్, బృందావన్ కాలనీ, తారకరామనగర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. తూప్రాన్‌లోని గాయత్రి నగర్ నీట మునిగింది. రామాయంపేట నుంచి సిద్దిపేట మార్గంలో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. హవేలిఘనపూర్ మండలం నక్కవాగులో కారు కొట్టుకుపోగా.. సహయం కోసం ఎదురు చూస్తున్న నరేందర్ గౌడ్‌ని కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలికి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చేరుకున్నారు. రాజపేట వాగు వద్ద ఆటో కొట్టుకుపోగా.. ఇద్దరు వ్యక్తులు చెట్టును పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొల్చారం మండలం తుక్కాపూర్‌లో మంజీరా నదిలో మహిళ గల్లంతయ్యింది. మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫాంలోకి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో 10 వేల కోళ్లు మృతి చెందాయి. సుమారు రూ.14 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఫౌల్ట్రీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. నార్సింగిలోని పౌల్ట్రీ ఫాంలోకి వరద చేరడంతో వేయి కోళ్లు మృతిచెందాయి. మెదక్ జిల్లాలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)